May 26

2 Timothy Chapter 4

New Testament, NT - 2 Timothy, Uncategorized

0  comments

Disclaimer: The notes below is provided to all who can use it. You may share the notes with others, you may print the notes, and use it for your study or preaching. However, please do not change or alter the notes in any way or form. If you use the notes, it would be appropriate to give credit to the author. Please do not use pictures provided in the notes for public use without consulting with the author. You may use this email to contact us: contact at bibleprabodhalu dot org


2 తిమోతి 4 వ అధ్యాయము 

2 తిమోతి 4:1-2 దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు యెదుటను, ఆయన ప్రత్యక్షతతోడు, ఆయన రాజ్యము తోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము; సంయమందును అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ది చెప్పుము. 

అబద్ద బోధకులను గూర్చి సూచనలు ఇచ్చిన తరువాత (2:1 -3:9), పౌలు ఇప్పుడు ఇద్దరు వ్యక్తులముందు తిమోతి కొన్ని అప్పగిస్తున్నాడు.

1) దేవుని ముందు మరియు

2) క్రీస్తుయేసు ముందు. ఈ విధముగా దైవత్వము యొక్క పరిపూర్ణతలో తండ్రియైన దేవునిని మరియు క్రీస్తును వేరుగా చూపిస్తున్నాడు. 

''దేవునియెదుటను మరియు క్రీస్తు యెదుటను ఆనబెట్టి చెప్పునదేమనగా.'' 1:6 వ వచనము నుండి కొనసాగించబడిన దీర్ఘమైన వాదనకు పౌలు ముగింపు ఇస్తున్నాడు. ''ఆ హేతువు చేత నా హస్తనిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను'' అనే వాదన. 

''నేను ఆనబెట్టి చెప్పునదేమనగా'' - ఈ పదము గ్రీకు భాషలో ఒకే పదముగా వున్నది. దాని యొక్క అర్ధం, భవిష్యత్ లో జరుగబోయే క్రియను గూర్చి, వ్యక్తిగత జ్ఞానముతో లేక అనుభవంతో గద్దిస్తూ ఇచ్చిన సూచన లేక హెచ్చరిక.''

''ఎదుటను'' అనేది పదమునకు అర్ధం - దేవుని సన్నిధిలో లేక దేవుని దృష్టిలో అని అర్ధం. (BDAG, 342). 

''దేవుని యెదుటను క్రీస్తుయేసు యెదుటను'' - ఈ రెండు నామవాచకములు ఇందాక చెప్పబడిన ఎదుటను అనే పదమునకు కర్తలుగా వున్నాయి. అదే, దేవుని సన్నిధిలో మరియు క్రీస్తుయేసు ఎదుటను నీకు ఆనబెట్టి చెప్తున్నాను అని పౌలు చెప్తున్నాడు. 

దేవునిని మరియు క్రీస్తుయేసును పౌలు చెప్తున్నప్పటికీ, సజీవులకు మరియు మృతులకు తీర్పు తీర్చువాడు మాత్రం క్రీస్తుయేసు (1 థెస్స 4:13-17, 2 కొరింథీ 5:9-11). కాబట్టి, ఇక్కడ పౌలు యొక్క ద్రుష్టి చివరి సంఘటనల మీద వున్నది. ముగింపు నందు లేక, రెండవ రాకడ యందు క్రీస్తు సజీవులకును మరియు మృతులకును తీర్పు తీరుస్తాడు. 

''ఆయన ప్రత్యక్షత తోడు మరియు ఆయన రాజ్యము తోడు'' - అంత్యకాల వాస్తవాలను తెలియచేస్తుంది. ఆయన తన రాజ్యమును స్థాపిస్తాడు. 

''వాక్యమును ప్రకటించుము, సమయమందును, అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ది చెప్పుము.'' 

ఈ బోధను దృష్టిలో పెట్టుకొని, పౌలు తిమోతిని వాక్యమును ప్రకటించమని ప్రోత్సహిస్తున్నాడు. (ఆజ్ఞాపిస్తున్నాడు). సమయమందును అసమయమందును ప్రకటించడానికి సిద్దపడి ఉండాలి, తన పరిచర్యలో - బోధలో వుండే అదనపు విలువలతో ప్రకటించుటకు ఎల్లపుడు సిద్ధముగా ఉండాలి. 

దేవుని వాక్యాన్ని ప్రకటించడము లేక బోధించడము అనేది తిమోతి యొక్క ప్రాథమిక బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతను కొనసాగించమని పౌలు సూచిస్తున్నాడు. 

రెండవ వచనంలో (4:2), 5 ఆజ్ఞలతో కూడిన మాటలను పౌలు ఉపయోగిస్తున్నాడు. 

వాక్యమును ప్రకటించుము - తిమోతి సువార్తను తప్పనిసరిగా ప్రకటించాలి (నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అనే దానికి సారూప్యతగా వుంది 1 తిమోతి 6:20). 

''వాక్యమును ప్రకటించుము'' అనే ఈ ఆజ్ఞ సమయమందును అసమయమందును ''ప్రయాసపడుము'' అనే మరొక ఆజ్ఞతో జోడించబడి వున్నది. అదేమనగా, తనకు  సౌకర్యముగా వున్నా, సౌకర్యముగా లేకపోయినా తిమోతి తప్పని సరిగా ప్రయాసపడాలి. బైబిల్ నుండి ఒక వర్తమానమును లేక ఏదైనా వర్తమానమును పూర్తిగా సిద్దపడి ఉండాలి అనే అర్ధం కాదు. ఇక్కడ లక్ష్యం ఏమనగా సువార్త - ఒక వ్యక్తి సువార్తను ప్రకటించుటకు ఎల్లపుడు సిద్ధముగా ఉండాలి. 

UBS చేతి పుస్తకము ఇలా చెప్తుంది:

సమయమందు, అసమయమందు తిమోతి వేగిరముగా ఉండాలి. వేగముగా అనే పదమునకు అర్ధం ''ఒకదాని పక్షమున నిలబడుట, దాని కొరకు సమీపముగా ఉండుట'' అనే అర్ధం తో అనువదించబడింది. కొన్ని తర్జుమాలు సిద్దపడియుండుట అనే అర్దాన్ని ఇచ్చాయి (ఉదాహరణకు NIV తర్జుమా). అయితే, ఇక్కడ వాడబడిన క్రియ ఈ అర్దాన్ని కూడా ఇస్తుంది, వ్యతిరేకత ఎదురయ్యినప్పటికి కార్యమును కొనసాగించటం.'' ''ఎడతెగక'' అనే అర్థమును కూడా ఇస్తుంది. ఇక్కడ చెప్పబడిన మాట సువార్తను ప్రకటించడంను సూచిస్తుంది. అనగా తిమోతి ప్రకటించే పరిచర్యను కొనసాగించాలని కోరబడుతున్నాడు. ఇతర అనేకమైన భాషలలో వేగముగా అనే కొత్త పదమును ఉపయోగించడం జరిగినది. ఉదాహరహణకు, .... వాక్యమును ప్రకటించుటకు, నీవు ఈ విషయాన్నీ పట్టు విడువకుండా చేయాలి... అని అర్ధం. 

మరొక పక్క, Gordon ఇలా చెప్తున్నాడు: 

ఇంకా వివరముగా, సమయమందు మరియు అసమయమందు అతడు సిద్దపడివుండాలి. ఇది KJV అనువాదానికి దగ్గరగా వుంది. ''సమయమందును, అసమయమందును.'' ఆశ్చర్యకరంగా, పౌలు యొక్క ఉద్దేశము స్పష్టముగా తెలియపరచబడలేదు. అక్కడ వాడబడిన క్రియ నీవు ప్రకటిస్తున్న వాక్యము ''పక్షముగా నిలబడు'' లేక ''దానిని కాపాడు'' అని అనువదించబడింది. అక్కడ వాడబడిన రెండు క్రియ విశేషణములు (గ్రీకు lettrers) కర్తను సూచించవచ్చు (అనగా తిమోతి), లేక కర్మణి సూచించవచ్చు (అనగా వినేవారిని). chrysostom అర్ధం చేసుకున్న ప్రకారం, అతనికి సౌలభ్యముగా వున్నా లేకపోయినా తనకు అప్పగింపబడిన లక్ష్యంలో నిలిచి ఉండాలి అని అర్ధం. తరువాతి అర్ధంలో, ''వినేవారికి అనుకూలమైన సమయం వచ్చిన రాకపోయినా, అతడు తనకు అప్పగింపబడిన లక్ష్యమందు నిలిచి యుండాలి'' అని అర్ధం. సందర్భానుసారముగా ఈ మాటలు తిమోతిని ఉద్దేశించి మాట్లాడుతున్నవి. 

ఖండించుము - సరిచేయుట అని అర్ధం.

గద్దించుము - ఎవరైతే తప్పు చేస్తున్నారో వారిని. 

దీర్ఘశాంతముతో ఉపదేశించుము - మిగతా అదనపు లక్షణాలన్నిటితో కూడా దీర్ఘశాంతము మరియు ఉపదేశముతో వారికి బుద్ది చెప్పుము. దీర్ఘశాంతము మరియు ఉపదేశము కలిసి వెళ్తాయి. ప్రత్యేకించి, తరువాతి వచనము యొక్క సందర్భాన్ని తీసుకుంటే అది, ''జనులు హితబోధను సహింపరు'' అని వుంది. అందుచేత దీర్ఘశాంతముతో ఉపదేశించాలి. 

2 తిమోతి 4:3 ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగుచేసుకొని.

''ఎందుకనగా'' పౌలు 5 రకములైన ఆజ్ఞలు ఎందుకు తిమోతికి చెప్పాడో గల వివరణను మరియు కారణాన్ని ఇస్తుంది. 

హితబోధను సహించని ప్రజలు వుండే సమయము వస్తాది. దీని అర్ధం హితబోధను సహించేవారు అసలు లేరు అన్ని కాదు. ఎఫెసులో వున్న కొంతమంది హితబోధను సహించటం లేదు. అయినప్పటికి పౌలు ప్రస్తుత పరిస్థితిని మరియు భవిష్యత్ పరిస్థితిని అనుసంధానం చేస్తున్నాడు. (చెడ్డ కాలములు వస్తాయి, ప్రజలు స్వార్థపరులుగా వుంటారు అని 3 వ అధ్యాయములో తాను చెప్పిన మాటను ఆధారముగా ఈ మాటను చెప్తున్నాడు). 

NIGTC  ఇలా చెప్తుంది, భవిష్యత్ కాలములో వాడబడిన వ్యాకరణము, అటువంటి పరిస్థితి ఇంతకూ ముందు రాలేదు అని పౌలు చెప్పినట్టు కాదు కాని తిమోతి ఎటువంటి పరిస్థితులకు సిద్దపడి ఉండాలో ఇచ్చిన హెచ్చరిక కాబట్టి అతడు భ్రమలో ఉండకూడదు లేక కాపాడడంలో నిర్లక్ష్యముగా ఉండకూడదు. 

''హితబోధను సహించరు'' అనగా అర్ధం - ప్రజలు వాక్యాన్ని సహనంతో వినరు అని అర్ధం. ఈ సందర్భంలో, తిమోతి ఏమి చెప్తాడో దానిని వినరు అని అర్ధం. 

''తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగు చేసికొని'' - వారి స్వకీయ దురాశలను అనుసరించి, వారు బోధకులను పోగు చేసుకుంటారు. బోధకులను పోగుచేసుకొనుట అనగా - వినేవాళ్ళు వాళ్ళల వుండే బోధకులను సమకూర్చుకుంటారు. ఇక్కడ ఆలోచన ఏమనగా, వారు ఏమి బోధించాలి, మరియు ఎటువంటి బోధ అంగీకరింపదగినది అనే దానికి ప్రజలే ప్రామాణీకము. 

''ఎందుకంటే వారు దురద చెవులు కలిగినవారు'' - వారు ఎందుకు ఇలా చేస్తారు అనే దానికి కారణం వారు దురద చెవులు కలిగిన వారుగా వున్నారు. ''వారు ఏమి వినాలి అనుకుంటున్నారో'' అనే మాట ప్రాముఖ్యముగా వుంది. దీనికి అర్ధం వారు సత్యానికి లేక దేవుని వాక్యానికి వ్యతిరేకం అని అర్ధం. 

''దురద చెవులు'' అనే మాటకు అర్ధం, ఆసక్తికరమైన సమాచారం లేక ఉత్సుకతో కూడిన సమాచారమును వినడానికి ఆసక్తి.         

2 తిమోతి 4:4 సత్యమునకు చెవినియ్యక కల్పనాకథలవైపునకు తిరుగు కాలము వచ్చును.

ఈ ప్రజలు వారి యొక్క సొంత ప్రమాణాలను ఏర్పాటు చేసుకోవడం మాత్రమే కాకుండా, వారు ఉత్సుకతతో కూడిన సమాచారం కొరకు ఆసక్తి కలిగి వున్నారు (దేవుని వాక్యము ఉత్సుకతతో ఉండదు కాని అది వాస్తవమైనది, పరిశుద్ధమైనది, మరియు కచ్చితమైన అంశాలను కలిగి వుంది). మరియు వారు సత్యమునకు అనగా సువార్తకు చెవినివ్వకుండా మళ్లుకుంటారు (భవిష్యత్ కర్తరి సూచక వాక్యము అనగా అది ఖచ్చితముగా జరుగుతుంది అని అర్ధం) (1 తిమోతి 6:5, తీతు 1:14, 2 తిమోతి 2:18, 3:7-8), మరియు వారు కల్పనా కథల (పురాణాలు) వైపునకు మళ్లుకుంటారు (1 తిమోతి 1:4, 4:7, తీతు 1:14). 

ఈ మాట ఏమి చెప్తుంది అంటే ప్రజలు సత్యాన్ని లేక సువార్తను వినడం ఆపేస్తారు. మరియు వారికీ అనుగుణమైన కథలు వినడానికి లేకా అబద్దాలు వినడానికి మళ్లుకుంటారు. 

2 తిమోతి 4:5 అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. శ్రమపడుము. సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. 

''అయితే నీవు'' నీవు అనే పదము నొక్కి చెప్పాలి- నీవు తిమోతి, ''అన్ని విషయములలో మితముగా ఉండుము'' - సమతూకం కలిగిన జీవితము జీవించు, లేక అన్ని పరిస్థితిలలో స్వీయ నియంత్రణ కలిగి యుండు అని అర్ధం. 

''శ్రమ పడుము'' - ఎందుకు తిమోతి శ్రమలు అనిపించాలి? ఎందుకంటే వాటి గుండా వెళ్ళవలసిన పరిస్థితిలు వస్తాయి కాబట్టి (3-5 వచనాలు గమనించండి). 

''సువార్తికుని పని చేయుము'' - వాక్యమును ప్రకటించుము; సువార్త ప్రకటించేవారికి ఇవ్వబడిన హోదా ఇది. 

''నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము'' - నీకివ్వబడిన లక్ష్యాన్ని పూర్తిగా నెరవేర్చు. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు అని చెప్పుట ద్వారా పౌలు తన వాదనను ముగిస్తున్నాడు. 

ఈ వచనము అంతా (పైన సూచనలన్నిటితో కలిపి) పౌలు యొక్క మాటలలోని వేగాన్ని సూచిస్తున్నాయి. 

తరువాత వచనము ఆ వేగమును గూర్చిన వివరణ ఇస్తుంది. 

2 తిమోతి 4:6 నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై యున్నది. 

ఆంగ్లములో ''ఎందుకంటే'' అనే పదముతో ఈ వచనము ప్రారంభించబడింది. ఈ పదము ఎందుకు పౌలు ఈ సూచనలన్నిటిని తిమోతికి ఇస్తున్నాడు మరియు సువార్తికుని పని చేయుము, పరిచర్యను కొనసాగించుము అని తిమోతిని ఎందుకు కోరుతున్నాడు అనే కారణాన్ని సూచిస్తుంది. 

Hendriksen ఈ విషయాన్ని చక్కగా వివరించాడు: 

తిమోతి తప్పని సరిగా వాక్యాన్ని ప్రకటించాలి, కేవలం భ్రష్టత్వం వస్తుందని మాత్రం కాదు కాని (1- 4 వచనములు) పౌలు నిత్యత్వము అంచులలోనికి వెళ్ళడానికి సిద్ధముగా వున్నాడు కాబట్టి. వృద్ధుడైన వ్యక్తి మరణించడానికి సిద్ధముగా వున్నాడు కాబట్టి యవ్వనస్తుడైన వ్యక్తి ఆ లోటును పూడ్చాలి. అతడు బాధ్యతలను తీసుకొని దానిని కొనసాగించాలి. 

ఇంతకుముందు చెప్పిన వచనంలో, అయితే నీవు ఈ పనులను కొనసాగించు అని చెప్పాడు ఎందుకంటే నేను చనిపోవడానికి సిద్ధముగా వున్నాను కాబట్టి. 

''నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను'' - పాతనిబంధనలో వున్నా పానీయార్పణము అనే పోలికను లేక అంశాన్ని పౌలు ఉపయోగిస్తున్నాడు (సంఖ్యా 15:7, 10). గోర్డాన్ ఇలా చెప్తాడు, ''ఇటువంటి పానీయార్పణము ద్రాక్షరసముతో కలపబడి (బహుశా అన్యులు అర్పించే రక్త పానీయార్పణములకు బదులుగా), దేవుని సన్నిధి ముందు పోయబడతాది (సంఖ్యా 28:7). అందుచేత పౌలు చెప్తున్నాడు, నేను పానార్పణముగా పోయబడ్డాను. నా జీవితం దేవుని ముందు పానార్పణముగా పోయబడింది అని. ఈ పోలిక దేవుని ముందు అర్పణముగా, చావు చేత ముగించబడుటకు సిద్ధముగా వున్నాడు అని తెలియచేస్తుంది. 

''నేను వెడలిపోవు కాలము సమీపమై యున్నది.'' మరొక పోలిక తన యొక్క మరణము వస్తుందని సూచిస్తుంది. పౌలు త్వరలో మరణించబోతున్నాడని గ్రహించగలుగుతున్నాడు. 

2 తిమోతి 4:7 మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.

ఈ వచనంలో, ఒక క్రీడాకారుని పోలికను ఉపయోగిస్తున్నాడు. 

''మంచి పోరాటం పోరాడితిని'' - నేను మంచి/ఘనమైన పోరాటంలో పాల్గొన్నాను. దీని అర్ధం పౌలు పోరాటాలలో పాల్గొన్నట్టు కాదు. అతడు సువార్త గురించి వాదిస్తున్నాడు తప్ప నిజమైన పోరాటాల గూర్చి కాదు (తన మార్పు తర్వాత). ''మంచి'' అనే పదము అతడు శ్రేష్ఠమైన వాడు అని సూచించటం లేదు కాని, తాను పాల్గొన్న పోరాటం మంచిది అని తెలియచేస్తున్నాడు, అదే సువార్త పరిచర్య అనే పోరాటం. పౌలు యొక్క జీవితములో సువార్త ప్రకటించడం లేక మరొక విధానములో చెప్పాలంటే, తాను మార్పు చెందిన తరువాత, తన జీవితమంతటిలో, పౌలు చేసినదంతా సువార్త ప్రకటనయే. 

''నా పరుగు కడ ముట్టించితిని'' - క్రీడాకారుని యొక్క పోలికను దృష్టిలో పెట్టుకొని, పౌలు ఇప్పుడు తన పరుగును కడముట్టించాను అని చెప్తున్నాడు. పరుగుపందెములో తన యొక్క భాగస్వామ్యాన్ని

నెరవేర్చాడు. 

''విశ్వాసమును కాపాడుకొంటిని'' - పౌలు తన యొక్క పిలుపుకు, తన యొక్క విశ్వాసానికి నమ్మకముగా వున్నాడు.  

2 తిమోతి 4:8 ఇకమీదట నాకొరకు నీతి కిరీటముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును. 

8వ వచనంలో, అంత్యకాల సంఘటనకు సంభందించిన నిశ్చయతను పౌలు ఇస్తున్నాడు. అది తన జీవితము యొక్క ఆధారముగా నీతి కిరీటము వుంచబడియున్నది. నీతి కిరీటమునకు సంభందించిన ఊహ చిత్రాన్ని బైబిల్ నిఘంటువు ఇలా చెప్తుంది. 

నూతన నిబంధనలో కిరీటము అనే పదము మూడు వివిధ అర్దాలలో వివరించబడింది. మొదటిది, పౌలు ఫిలిప్పి , మరియు థెస్సలొనీక సంఘాలను తన యొక్క కిరీటాలుగా వర్ణించాడు (ఫిలిప్పి 4:1, 1 థెస్స  2:19). ఈ సమాజములలో విశ్వాసులను తయారుచేయుటకు తాను ప్రయాసపడిన కష్టము పౌలు యొక్క నిరీక్షణకు మరియు సంతోషానికి మూలముగా వున్నది. ఈ పోలికలు యెషయా 62:3 లో వున్నా పోలికలనుండి తీసుకొనబడినవి. పౌలు యొక్క రాజ మకుటం సువార్త నిమిత్తము క్రీస్తు యొక్క రాయబారిగా తాను పడిన కష్టానికి ప్రతిఫలంగా దక్కింది. రెండవది, కిరీటములు మరియు బహుమానములు సువార్త విషయములో ఎవరైతే నమ్మకముగా వుంటారో వారికి ఇవ్వబడుతున్నాయి. ''ఆ దినమందు,'' క్రీస్తు అనే న్యాయాధిపతి తనకు ఇవ్వబోయే నీతి కిరీటము గూర్చి పౌలు ఎదురు చూస్తున్నాడు ( 2 తిమోతి 4:8). మూడవది, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో మరియు శోధనను సహిస్తారో వారికి ''జీవ కిరీటము'' వుంది (యాకోబు 1:12, ప్రకటన 2:10, 3:11). పెద్దలు ఎవరైతే మందను నమ్మకముగా కాస్తారో వారు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనపుడు ''మహిమ కిరీటమును'' పొందుకుంటారు (1 పేతురు 5:4). క్రీస్తు స్వారూప్యతలోనికి నిర్దారించబడిన క్రైస్తవులు ఒకరోజున క్రీస్తుతో పాటు పరిపాలించేవారిగా ఉండి రాజులుగా వుంటారు. క్రీస్తు యొక్క ఆశీర్వాదములు విశ్వాసిలో ప్రవేశపెట్టబడ్డాయి, అయితే, క్రీస్తునుండి ఆ ఆశీర్వాదములు పొందుకొనుటకుక్రీస్తు మన కొరకు పాపముగా చేయబడ్డాడు. మనకొరకు ఆయన తన మహిమ కిరీటమును పక్కన పెట్టి ముండ్ల కిరీటమును ధరించాడు (మత్తయి 27:29, మార్కు 15:17, యోహాను 19:2, 5, ఫిలిప్పి 2:6-8). ఏమైనప్పటికి, హెచ్చించబడిన క్రీస్తుగా, తన అధికారమును మరియు విశ్వమంతటి మీద తన సార్వభౌమత్వాన్ని కీరీటముగా ఆయన ధరించుకున్నాడు (ప్రకటన 6:2, 14:14).  

''ఆ దినమందు, నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకు అనుగ్రహించును'' - నీతి కిరీటము అనేది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు నాకు ఇస్తాడు అనగా - ఆయన రాకడ యందు అని అర్ధం. 

ఈ కిరీటము కేవలము పౌలుకు మాత్రమే కాదు కాని, ''తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికి'' ఇవ్వబడుతుంది. అదేమనగా, యేసుక్రీస్తు న్యాయాధిపతిగా ఉండితన యొక్క రాకడలో, పౌలుకు మరియు వారి నీతిగల క్రియల ద్వారా క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూస్తున్న వారందరికి బహుమానములు కుమ్మరిస్తాడు. 

2 తిమోతి 4:9-12 నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. దేమా యిహలోకమును స్నేహించి నన్ను విడిచి థెస్సలొనీకకు వెళ్లెను, క్రేస్కె గలతీయకును తీతు దల్మతియకును వెళ్లిరి.లూకా మాత్రమే నా యొద్ద వున్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకికును ఎఫెసునకు పంపితిని. 

ఈ భాగములో, 9-18 వరకు వున్నా వచనాలలో పౌలు తనయొక్క చివరి ప్రోత్సహకారమైన మాటలు మరియు సూచనలు తిమోతికి ఇస్తున్నాడు. 

9వ వచనంలో, ఎదో ఒక ప్రయత్నము చేసి త్వరగా వచ్చి పౌలును చూడమని పౌలు తిమోతిని కోరుతున్నాడు. పౌలు యొక్క మాటలలో అత్యవసరత కనపడుతుంది- ఎందుకంటే అతడు ఒంటరిగా వున్నాడు. అతడు తిమోతిని చూడాలని ఆశపడుతున్నాడు. 

తరువాత అతడు కొనసాగిస్తూ దేమా తనను విడిచి వెళ్లాడని చెప్తున్నాడు, కారణం అతడు యిహలోకమును స్నేహించాడు (1 తిమోతి 4:8, తీతు 2:12, గలతి 1:4, ఎఫెసీ 1:21). ఈ లక్షణము రాబోయే కాలమునకు వ్యత్యాసముగా వున్నది. క్రీస్తు యొక్క ప్రత్యక్షతను ప్రేమించేవారికి కూడా ఇది వ్యత్యాసముగా వున్నది. 

తరువాత అతడు కొనసాగిస్తూ దేమా థెస్సలొనీకకు, క్రేస్కె గలతీయకు, తీతు దల్మతియ కు వెళ్లారు, లూకా మాత్రమే నా యొద్ద వున్నాడు అని చెప్పాడు. 

''మార్కును వెంటబెట్టుకుని రమ్ము'' - మార్కు తిమోతితో  వున్నాడో లేడో మనకు తెలియదు. కాని మార్కును వెంటబెట్టుకుని రమ్మని తిమోతికి చెప్పబడింది. మార్కును వెంటబెట్టుకొని రమ్మనుటకు గల కారణం మార్కు పౌలు యొక్క పరిచర్యలో ప్రయోజనకరమైన వాడుగా / సహాయకారిగా వున్నాడు (బహుశా సువార్త ప్రకటించుటలో కావచ్చు). 

''తుకికును ఎఫెసునకు పంపితిని'' - (తీతు 3:12, కొలస్సి 4:7, ఎఫెసీ 6:21-22 ). అతడు బహుశా పత్రికను తీసుకెళ్ళేవాడు కావచ్చు లేక తిమోతి స్థానములో ఉండుటకు పంపబడి ఉండొచ్చు. 

2 తిమోతి 4:13 నీవు వచ్చినపుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. 

''నీవు వచ్చునప్పుడు'' అని తిమోతిని పౌలు అడుగుతున్నాడు అంటే దాని అర్ధం తిమోతి ఖచ్చితముగా వస్తాడు అని పౌలు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అతడు  వచ్చేటపుడు అతడు అంగీని తీసుకుని రమ్మని కోరబడ్డాడు - ఇది ఒక వస్త్రము. 

అంగీని గూర్చి NIGTC ఈలాగు చెప్తుంది, ''ఒక పెద్ద, చేతులు ఉండని బాహ్య వస్త్రం, ఒకే ఒక్క ముడి పదార్థంతో చేయబడుతుంది. తల ప్రవేశించుటకు మధ్యలో ఒక రంద్రం ఉంటుంది'' (Kelly). ఇది చలి నుండి వర్షము నుండి కాపాడుతుంది కాబట్టి, పౌలు దానిని తీసుకు రమ్మని చెప్పాడు ఎందుకంటే శీతాకాలం సమీపముగా ఉంది కాబట్టి (21వ). మరియు చెరసాల కూడా చల్లగా ఉంటుంది కాబట్టి. 

''అలాగే పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము'' - పౌలు తన సమాచారమును రాయడానికి రెండవ రచయితను ఉపయోగిస్తూ ఉండవచ్చు అని చాలమంది అభిప్రాయపడుతుంటారు. ఇప్పుడు, పౌలు ఒక విద్యావంతుడు, తన సొంత ఆలోచనలను అతడు రాసుకోగలడు, కాబట్టి కొన్నిటిని అతడు వ్రాసి ఉండవచ్చు కూడా. లేక మరొక వాటికీ సంభందించిన చర్మపు కాగితములు కావచ్చు అవి. తిమోతి వస్తున్నపుడు వాటిని తీసుకుని రమ్మని పౌలు చెప్పాడు అంతే. (అనవసరమైన ఊహలు చేయడం మంచిది కాదు).         

2 తిమోతి 4:14-15 అలెక్సంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలమిచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మన మాటలను బహుగా ఎదిరించెను. 

పౌలు తనకు కీడు చేసిన కంచరివాడైన (లోహములతో పని చేసేవాడు) అలెక్సంద్రును జ్ఞాపకము చేసుకుంటున్నాడు. అతడు ఎటువంటి కీడు చేసాడు? ''చేసాడు'' అన్న పదమునకు ఆంగ్లములో వాడబడిన పదము న్యాయానికి సంబంధించినది (అనువాదంలో తేలికైన అర్ధముతో అనువదించబడింది). కాబట్టి ఆంగ్లములో వాడబడిన ఈ పదమునకు అర్ధం ''వ్యతిరేకముగా సమాచారం ఇచ్చుట.'' 

బహుశా పౌలు బందీగా పట్టబడుటకు అలెక్సంద్రు కారణము కావచ్చు. 

ఇక్కడ వున్న సందర్బమును బట్టి ఆలోచన చేస్తే, కంచరివాడైన అలెక్సంద్రు గొప్ప కీడు చేయుటను బట్టి పౌలు బంధించబడ్డాడు అని అర్ధం చేసుకోవచ్చు. ఇది ''వ్యతిరేకముగా సమాచారం ఇచ్చుట'' అనే పదముతో ఈ విషయము బలపడుతుంది. మరియు మరొక గమనించదగిన విషయం ఏమనగా, 15వ వచనంలో, అతడు మన మాటలను బహుగా ఎదిరించాడు అని వ్రాయబడింది (ఇక్కడ వాడబడిన పదము 3:8 లో కూడా వాడబడింది). 

''అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలమిచ్చును'' - పౌలు మరొకసారి దేవునియందు తనకున్న నిశ్చయతను తెలియచేస్తున్నాడు అదేమనగా, దేవుడు తన నీతి యందు అలెక్సంద్రు యొక్క క్రియల చొప్పున న్యాయము తీరుస్తాడు (అంత్యకాల సంఘటన). 

''అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము, ఆతడు మా మాటలను బహుగా ఎదిరించెను'' - ఏది ఏమైనప్పటికి, తిమోతి, నీవు జాగ్రత్తగా వుండు, అతని మీద ఒక కన్ను వేసి వుంచు లేక అతని నుండి నిన్ను నీవు కాపాడుకో. ఎందుకు? ఎందుకంటే అతడు వారి మాటలను బహుగా ఎదిరించాడు. 

2 తిమోతి 4:16 నేను మొదట సమాధానము చెప్పినపుడు ఎవడును నా పక్షముగా నిలువలేదు. అందరు నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరంగా ఎంచబడకుండును గాక. 

పౌలు ఇప్పుడు తన యొక్క సొంత స్థితిని గూర్చి మాట్లాడుతున్నాడు. 

''నేను మొదట సమాధానము చెప్పినపుడు'' - కొంతమంది దేనిని మొదటి సారి చెరసాలలో బంధించబడినపుడు సందర్భములోనిది అని ఆలోచిస్తారు. ఇది, తనయొక్క ప్రస్తుత స్థితిని కూడా సూచించవచ్చు. గోర్డాన్ ఈ విధముగా చెప్తాడు, తన మొదటి చెరసాల శిక్షలో ప్రాథమిక విచారణ తరువాత రెండు సంవత్సరాల ఆలస్యం ఇవ్వబడినది (అ.కా. 24:1, 23, 27, 28:16, 30), పౌలు అటువంటి అవకాశం మరల ఒక మంచి కారణం కొరకు రావాలని ఎదురు చూస్తున్నాడు, అదేమనగా, ఈ పత్రిక తిమోతికి చేరి అతడు తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్నాడు. 

''ఎవడును నా పక్షముగా నిలువలేదు, అందరు నన్ను విడిచిపోయిరి'' - బహుశా ఇది ఉద్దేశముతో చేసినదై యుండవచ్చు లేక ఎవరును అతని పక్షముగా నిలువబడని క్లిష్ట పరిస్థితి కావచ్చు. 

''ఇది వారికి నేరంగా ఎంచబడకుండును గాక'' - తనను విడిచిపోయిన వారి పట్ల పౌలు కనికరము చూపిస్తున్నాడు. తనను విడిచిపోయినవారందరి పట్ల.

2 తిమోతి 4:17 అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్యజనులందరును దాని విను నిమిత్తమును, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోటనుండి తప్పింపబడితిని. 

''ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను'' - అందరు అతనిని విడిచిపోయినప్పటికి, ప్రభువు మాత్రం రెండు విషయాలు చేసాడు.

1) ప్రభువు పౌలు పక్కన నిలిచి, అతనిని బలపరిచాడు. 

2) సింహము నోటనుండి పౌలును తప్పించాడు. 

ప్రభువు నా ప్రక్కన నిలువబడ్డాడు అని పౌలు చెప్పుట ద్వారా, దేవుడు తన దగ్గరకు సహాయము చేయడానికి వచ్చాడు అని చెప్తున్నాడు. మరియు తనను బలపరిచాడు అని చెప్పుట ద్వారా, అతడు ఎదో ఒకటి చేయడానికి దేవుడు అతనిని ప్రేరేపించాడు అని అర్ధం (BDAG, 333). ఈ సందర్బములో, ''సువార్తను పరిపూర్ణముగా ప్రకటించుటకు'' ప్రభువు పౌలును బలపరిచాడు. 

''నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్యజనులందరును దాని విను నిమిత్తమును'' - ఇది ఉద్దేశముతో కూడిన మాట. ప్రభువు ప్రక్కన నిలిచి, పౌలును బలపర్చుటకు కారణము ఏమనగా, సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము (వాక్యము యొక్క సమాచారమంతటిని - పూర్తిగా ప్రకటించుట), మరియు అన్య జనులందరును దాని విను నిమిత్తమును (ఒకసారి విన్నవారందరు). 

''గనుక నేను సింహము నోటనుండి తప్పింపబడితిని'' - అతడు సింహము నోటనుండి రక్షించబడ్డాడు. సింహము నోరు అనగా అర్థమేంటి? ఇది పోలికతో కూడిన భాష. సింహము నోటనుండి అనగా, పౌలు మరణము నుండి లేక గొప్ప ప్రమాదమునుండి తప్పించబడ్డాడు అని అర్ధం (BDAG, 593). ఇటువంటి పోలికతో కూడిన భాష 22 వ కీర్తనలో కూడా ప్రతిధ్వనిస్తుంది. 

2 తిమోతి 4:18 ప్రభువు ప్రతి దుష్కార్యమునుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. 

ఈ వచనంలో, పౌలు సిద్ధాంతపరమైన అంశాన్ని మాట్లాడుతున్నాడు. ప్రభువు కేవలం అతనిని ప్రతి శ్రమ నుండి మరియు ప్రతి ప్రమాదమునుండి, తప్పించడం మాత్రమే గాక, ప్రతి దుష్కార్యమునుండి  కూడా అతనిని తప్పిస్తాడు. (భవిష్యత్ క్రియ) (దుష్కార్యము అనగా ప్రతి సత్కార్యమునకు వ్యతిరేకమైనది 2:21, 3:17). తరువాత అతడు కొనసాగిస్తూ ప్రభువు తనను పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును అని చెప్తున్నాడు (రక్షించుట లేక భద్రపరచుట). దీని అర్ధం పౌలు మరణము నుండి తప్పించబడతాడని కాదు (శారీరక మరణము), కానీ అతడు అంత్యకాలము యొక్క వాస్తవికతను తెలియచేస్తున్నాడు - దేవుడు తనను తన ఇంటికి తీసుకు వస్తాడు అని చెప్తున్నాడు (దేనికి విశ్వాసులందరు చెందినవారో ఆ ఇంటికి). 

''యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక'' - దేవుడు ఏమైతే ప్రారంభించాడో, దానిని ఆయన ముగిస్తాడు. 

Gordon ఈ విధముగా చెప్తాడు: క్రీస్తునందు దేవుడు ఏమైతే నెరవేర్చాడో, దాని యొక్క తుది సంపూర్ణతను ఆయన చూస్తాడు. అయన ప్రారంభించిన రక్షణ ఆయన నిజముగా పూర్తి చేస్తాడు.ఇది అంత్యకాలానికి సంబంధించిన విజయము, గత విజయాలను ప్రస్తావించుటకు కాదు. ముగింపు పిలుపునిచ్చాడు (1 తిమోతి 1:17, 6:15-16). యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక. 

2 తిమోతి 4:19-22 ప్రిస్కకును అకులకును ఒనేసిఫొరు ఇంటివారికిని నా వందనములు. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయెను. త్రోఫిము రోగియైనందున అతని మిలేతులో విడిచివచ్చితిని. శీతాకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయుము. యుబూలు, పుదే, లిను, క్లౌదియయు సహోదరులందరు నీకు వందనములు చెప్పుచున్నారు.

పౌలు ముగింపు వందనములు తిమోతికి మరియు అందరికి  తెలియచేస్తున్నాడు (4:22). 

ప్రిస్కకు అకులకు వందనములు - పౌలు వారిని కొరింథీలో కలుసుకున్నాడు (అ.కా. 18:1-3). వారికి వందనములు చెప్పుము అని చెప్పడము ఆశ్చర్యకరంగా వున్నది. ఈ మాట ప్రిస్క మరియు అకుల ఎఫెసులో వున్నారని అర్ధమవుతుంది. (అ.కా. 18:18-26). 

''మరియు ఒనేసిఫొరు ఇంటివారికి వందనములు'' - పౌలు యొక్క సంకెళ్లను గూర్చి సిగ్గుపడక పౌలును శ్రద్దగా వెతికిన వ్యక్తి - పౌలుకు సహాయము చేసిన వ్యక్తి. 

''ఎరస్తు కొరింథీలో నిలిచిపోయెను'' - యితడు కొరింథీ పట్టణములో అధికారి అయి ఉండవచ్చు (రోమా 16:23). 

''త్రోఫిము రోగియైనందున అతనిని మిలేతులో విడిచి వచ్చితిని'' - పౌలు యెరూషలేముకు చివరిసారిగా ప్రయాణము చేస్తున్నపుడు, యితడు పౌలుతో పాటు ప్రయాణము చేసినవాడు (అ.కా. 20:4, 21:29). త్రోఫిము పట్టణానికి దగ్గరగా ఉన్నాడని పౌలు యొక్క సూచన కావచ్చు. పౌలు అతనిని విడిచిపెట్టినపుడు అతడు రోగిగా వున్నాడు. 

ఈ పేర్లు మరియు వందనములు మనకు తెలియపరచేవి ఏమనగా పౌలు వారితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడని మరియు మనకు రోజు వారి సమస్యలతో అతడు ఉన్నాడని తెలియచేస్తున్నాయి. 

''శీతాకాలం రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయుము'' - నా యొద్దకు రావడానికి చేయదగిన ఏ ప్రయత్నమైనా చేయుము అని పౌలు చెప్తున్నాడు. ఎందుకు శీతాకాలమునకు ముందే రావాలి?

1) పౌలు తిమోతిని చూడాలని ఆశపడుతున్నాడు మరియు

2) బహుశా సముద్ర మార్గము శీతాకాలములో మూసివేయబడవచ్చు (Gordon Fee, 301; NIGTC, 477). 

''యుబూలు, పుదే, లిను, క్లౌదియయు సహోదరులందరును నీకు వందనములు చెప్పుచున్నారు'' - ఈ పేర్లు లాటిన్ భాషను సూచిస్తున్నవి. కాబట్టి వీరు రోమాలో వున్న సన్నిహిత స్నేహితులు కావచ్చు లేక రోమా విశ్వాసులు కావచ్చు. 

2 తిమోతి 4:22 ప్రభువు నీ ఆత్మకు తోడై యుండును గాక, కృప మీకు తోడై యుండును గాక. 

ఆశీర్వాదము రెండు భాగములుగా వున్నది. 

1) ప్రభువు నీ ఆత్మకు తోడైయుండును గాక - దేవుడు ఈ వ్యక్తితో ఉండాలి అనేది పౌలు యొక్క కోరిక. 

2) కృప మీకు తోడైయుండును గాక - దేవుని కృప సంఘమంతటికి ఉంటుంది. - ఈ మాట ఈ పత్రిక వ్యక్తిగతముగా తిమోతికి వ్రాయబడినప్పటికి, పౌలు ఎఫెసులో  వున్న సంఘమును గూర్చి శ్రద్ద కలిగి ఉన్నాడని సూచిస్తుంది .   


Written by Dr. Joel Madasu; Trans. Bro. Samuel Raj.


Tags

#bsn.bibleprabodhalu, 2 Timothy 4, New Testament


You may also like

2 Timothy Chapter 3

2 Timothy Chapter 3

2 Timothy Chapter 2

2 Timothy Chapter 2
>